చనిపోయే ముందు సాలూరు రాజేశ్వరరావు ఏడేళ్లు బెడ్ మీదే ఉన్నారు!
on Aug 6, 2021
తెలుగు సినిమా సంగీత స్వరూపాన్ని మార్చిన ఘనుడిగా కీర్తి ప్రతిష్ఠలు సంపాదించారు సాలూరు రాజేశ్వరరావు. అనుసరణలూ అనుకరణలూ లేకుండా కొత్త శైలిలో సంగీతాన్ని సృష్టించారు. ఆయన స్వరాలు కూర్చిన 'ఇల్లాలు' (1940) చిత్రంలోని పాటలు అప్పట్లో కేవలం తెలుగు ప్రాంతంలోనే కాకుండా మొత్తం దక్షిణాదిలోనే ఓ సంచలనం. మల్లీశ్వరి, మిస్సమ్మ, ఇద్దరు మిత్రులు, ఆరాధన, డాక్టర్ చక్రవర్తి, రంగుల రాట్నం, పూల రంగడు, మనుషులంతా ఒక్కటే, కురుక్షేత్రము లాంటి సినిమాలకు ఆయన స్వరాలు కూర్చిన పాటలను మరచిపోయేదెవరు! చివరి రోజుల్లో ఆయన బెడ్‌మీద ఏకంగా ఏడు సంవత్సరాలు ఉన్నారనే విషయం ఇప్పటి సంగీత ప్రియులకు, గాయనీ గాయకులకు, సంగీత దర్శకులకు చాలామందికి తెలీదు.
కృష్ణంరాజు సొంత సినిమా 'తాండ్ర పాపారాయుడు'కు రసగుళికల్లాంటి పాటలను అందించిన సాలూరి, దాని తర్వాత 'అయ్యప్ప పూజాఫలం' అనే చిత్రాన్ని ఒప్పుకున్నారు. ఆ సినిమా కోసం నాలుగు పద్యాలు, మూడు పాటలకు స్వరాలు కూర్చారు. ఎస్పీ బాలు, ఏసుదాస్, పి. సుశీలతో పాటలు పాడించి రికార్డు చేయించారు. కానీ ఆ సినిమా ఆ పాటల రికార్డింగ్‌తోటే ఆగిపోయింది.
ఓ రోజు ఆయనకు ఎక్కిళ్లు రావడం మొదలై ఎంతకీ ఆగలేదు. వాళ్లింటి సమీపంలో ఉండే ఫ్యామిలీ డాక్టర్ విజయ్‌కుమార్‌ను పిలిపించారు. ఆయన మందు ఇచ్చాక ఎక్కిళ్లు తగ్గాయి. కానీ అనూహ్యంగా రాజేశ్వరరావు శరీరంలో ఒకవైపు పక్షవాతం వచ్చేసింది. ఆయనకు అంతదాకా బీపీ కానీ, షుగర్ కానీ లేవు. కానీ ఒక్కసారిగా హైబీపీతో పాటు సెరిబ్రల్ పెరాలసిస్‌కు గురయ్యారు. ఫలితం.. ఏడేళ్లు మంచంమీదే ఉండిపోయారు. ఉలుకూ పలుకూ లేదు. కొంతకాలం హాస్పిటల్‌లో.. కొంతకాలం ఇంట్లో బెడ్ మీదే ఉన్నారు. నోట్లో ట్యూబ్‌తో పాలు పట్టేవారు ఇంట్లోవారు. టాబ్లెట్లు కూడా పొడిచేసి నోట్లో వేసేవారు.
ఐదుగురు కొడుకులు, ఐదుగురు కోడళ్లు రాజేశ్వరరావు పసిబిడ్డలాగా చూసుకున్నారు. అలా బెడ్ మీద ఉండే మనవళ్లు, మనవరాళ్లతో ఆడుకుంటూ వచ్చారు. అద్భుతమైన, సమ్మోహనమైన స్వరాలతో తెలుగు సినిమా పాటను సుసంపన్నం చేసిన సాలూరు రాజేశ్వరరావు 1999 అక్టోబర్ 26న తుదిశ్వాస విడిచారు. సంగీత దర్శకుడిగా ఆయన వారసత్వాన్ని ఆయన కుమారులు వాసూరావు, కోటి కొనసాగించారు.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
